తెలుగు వీర లేవరా !

Ram Kottapalli
March 19, 2024

తెలుగు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పాఠకులు, విమర్శకులు, పరిశోధకుల మధ్య భావజాల మార్పిడికి ఒక వేదిక గొప్ప క్షేత్రం అవుతుంది. ఇటువంటి తెలుగు సభల్లో, సదస్సుల్లో పాల్గొనేవారు తమ సృజనాత్మక రచనలను పంచుకోవడానికి, ఇతరుల నుండి అభిప్రాయం పొందడానికి ఒక వేదికను పొందుతారు. మనం గమనిస్తే ఎక్కడైనా ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల కంటే, ప్రజలు చైతన్యవంతులై వారికి వారే పూనుకుని ఒక సదస్సుగా కానీ, ఒక బృందంగా కానీ ఏర్పడి ప్రణాళికలు వేసుకుని వాటిని అమలుపరిచినపుడే ఆ కృషి వల్ల జరిగిన అభివృద్ధి ప్రభావం ఎక్కువ కనబడుతుంది. మరి అలాంటి కృషి మన తెలుగు భాషపై జరిగితే..?

ఈ నెల 9, 10వ తేదీల్లో, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితి సదస్సుకి నేను(రామ్), మీనా యోగీశ్వర్, దాసుకిరణ్ గారు హాజరు అయ్యాము. రాజకీయవేత్తలు, సాహితివేత్తలు, కవులు, రచయితలు, అవధానులు, సినీ గేయ రచయితలు, సోషల్ మీడియాలో వారి గొప్ప రచనలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన రచయితలు, ఇలా ఎందరో దిగ్గజాలు హాజరు అయిన ఈ తెలుగు సాహితి సదస్సు రెండు రోజులు పాటు ఎంతో ఉల్లాసంగా ఒక పెద్ద పెళ్లి పండుగలా జరిగింది. 

సుమారు అయిదు వందల మంది హాజరు అయిన ఈ సదస్సులో వందమందికి పైగా ప్రముఖులు రెండు రోజుల పాటు, తెలుగు భాష పట్ల వారి గళాన్ని వినిపించారు. వీరి ప్రసంగాలు ప్రేరణాత్మకంగానూ, హాస్యచతురతతోనూ, ఆలోచనాత్మకంగానూ సాగాయి. తెలుగు భాషా పరంపర గురించి, నాడు తెలుగు భాష ఎలా ఉంది ? నేడు ఎలా ఉంది ? భవిష్యత్లో తెలుగు భాష పట్ల కృషి ఎలా ఉండాలి అన్న విషయాలపై వక్తలు అద్భుతంగా ప్రసంగించారు. 

మన దాసుభాషితం తరుపున మొదటి రోజు సాయంత్రం 8 గంటలకి మీనా యోగీశ్వర్ మీనా ప్రశ్న(సాహిత్య క్విజ్) నిర్వహించారు. ఇందులో కొన్ని ప్రశ్నలు మీనా గారివి కాగా, కొన్ని మన దాసుభాషితం వాట్సాప్ కూటమి సభ్యుల నుంచి తీసుకున్నవి. సంప్రదాయం ప్రకారం అక్కడి వారికి కూడా శాపాలు పెట్టడంతోనే క్విజ్ మొదలుపెట్టారు మీనా. “సమాధానాలు తెలిసీ చెప్పకపోతే మీ పళ్ళెంలో గులాబ్ జామ్ పోయి పన్నీర్ కూరలో పడిపోతుంది” అని, అప్పటికే తినేసినవారికి తరువాతి రోజు మధ్యాహ్నం కిళ్ళీ పండదు” అని శాపాలు పెట్టేశారు. అందుకే కాబోలు ప్రశ్నలన్నిటికీ సభ్యులు చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. 

రెండవ రోజు మద్యాహ్నం 3 గంటలకి దాసుభాషితం తరుపున కిరణ్ గారు పత్ర సమర్పణ చేసారు. “ఫేస్ బుక్ రచనలు” పేరుతో ఫేస్ బుక్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఇద్దరు రచయిత్రులు ‘డాక్టర్ మైథిలీ అబ్బరాజు’ గారు, ‘శ్రీమతి రాధిక మంగిపూడి’ గార్ల గురించి ఈ వ్యాసంలో వివరించారు కిరణ్ గారు. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని, రచనలను మరింత విస్తృతంగా పాఠకులకు అందించేందుకు రచయితలకు ఉన్న Options ను కూడా వివరించారు.

పై రెండు కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు ఈ కింది లింకుల్లో చూడగలరు.

మీనా ప్రశ్న క్విజ్ ప్రోగ్రామ్ : https://youtu.be/I6FWPwjPH0E

దాసుకిరణ్ గారి పత్ర సమర్పణ : https://youtu.be/6YXaOUj1GMM

ఇక ఈ తెలుగు సదస్సు నిర్వహణ ఎవరైనా చూస్తే ఇక్కడ పెద్ద పెళ్లి పండగ ఏమైనా జరుగుతుందా ? అన్నంత రమణీయంగా జరిగింది ఈ సదస్సు. మరి అంతే కదా మన తెలుగు నాట జరిగే పెళ్ళిళ్ళల్లో ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలు, వివిధ రంగాలలో స్థిరపడిన చిన్నా పెద్ద అంతా వస్తారు. అలాంటి పెళ్ళిళ్ళు  ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి అని పాడుకున్నట్లు జరుగుతాయి కదా. అలా జరిగింది వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు. ఈ రెండు రోజుల కార్యక్రమం గురించి రెండు నెలల ముందు నుంచి ప్రణాళికలు వేసుకుని, వేదికను ఎంచుకుని, కార్యక్రమ నిర్వహణ ప్రణాళికలు రాసుకుని, ఈ సదస్సు నిర్వహణలో రకరకాల పనులను, కర్తవ్యాలను విభాగాల వారీగా విడదీసి ఒక్కో విభాగానికి ఒకొక్కరిని నియమించి, అతిధులకి మర్యాదలు, సత్కారాలు, పురస్కారాలు, విడిది ఏర్పాట్లు అంతా ఘనంగా చేసి ఈ కార్యక్రమాన్ని అమలు పరిచిన కార్యనిర్వాహకుల తీరుకి సెహభాషులు. 

కానీ ఇదంతా ఎందుకు ? ఒక తెలుగు సాహితీ సదస్సుని ఒక పెళ్లిలా ఎందుకు జరపాలి ?

మనం గమనిస్తే ఎక్కడైనా ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల కంటే, ప్రజలు చైతన్యవంతులై వారికి వారే పూనుకుని ఒక సదస్సుగా కానీ, ఒక బృందంగా కానీ ఏర్పడి ప్రణాళికలు వేసుకుని వాటిని అమలుపరిచినపుడే ఆ కృషి వల్ల జరిగిన అభివృద్ధి ప్రభావం ఎక్కువ కనబడుతుంది. మరి అలాంటి కృషి మన తెలుగు భాషపై జరిగితే..?

అందరి దృష్టి తెలుగు భాషపైకి మళ్లుతుంది. తెలుగు భాషా సాహిత్యంపై ఆసక్తి ఉన్న వ్యక్తులందరూ  ఒక వేదికపైకి వస్తారు. అప్పుడు తెలుగు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పాఠకులు, విమర్శకులు, పరిశోధకుల మధ్య భావజాల మార్పిడికి ఈ వేదిక గొప్ప క్షేత్రం అవుతుంది. ఇటువంటి తెలుగు సభల్లో, సదస్సుల్లో పాల్గొనేవారు తమ సృజనాత్మక రచనలను పంచుకోవడానికి, ఇతరుల నుండి అభిప్రాయం పొందడానికి ఒక వేదికను పొందుతారు. తెలుగు సంస్కృతి మన వారసత్వం పట్ల భావోద్వేగం పెరిగి తెలుగు భాష గొప్పతనం అందరికీ చాటి చెపుతాము. 

తెలుగు భాషపై అవగాహన ఉండి writer's block లాంటి సమస్యలు, ఏం చేయాలో తెలియని స్తబ్ధత్వం లాంటి సమస్యలకు ఇటువంటి తెలుగు సభలు గొప్ప Brainstorm ఇచ్చి కొత్త కొత్త, గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిస్తాయి. ఇలా విభిన్న దృష్టి కోణాల్లో తెలుగు భాషాభివృద్ధిని చూడటం, విభిన్న రంగాల నుంచి  తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేయడం, అది కూడా గొప్ప స్థాయిలో చేయడం ఎంతో అవసరం. అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ కోట్లాది జనుల్ని చైతన్యపరిచిన కాళోజీ గారి మాటే అందుకు నిదర్శనం. ఇలాంటి తెలుగు సాహితీ సదస్సులు మరెన్నో జరగాలి, తెలుగు జెండా ఇంకా పై పైకి ఎగరాలి. 

అపస్వరాలు - నవల

Tap to Listen

డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు. డబ్బుంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు. ఇలా డబ్బు సమాజంలో ఒక మనిషి స్థాయిని ఎలా నిర్దేసిస్తుందో ఒక సినిమా పాటలో రచయిత చంద్రబోస్ చెప్పారు. అలాంటి డబ్బు కొందరికి కష్టపడితే వస్తుంది, ఇంకొందరికి వారసత్వంగా వస్తుంది. మరికొందరికి అరుదుగా లాటరీ రూపంలో వచ్చి వరిస్తుంది. అలా అనుకోకుండా డబ్బుల బుట్టలో పడినవాడే రౌడీ షీటర్ వరదరాజు. శారద కలం పేరుతో యస్. నటరాజన్ రాసిన అపస్వరాలు నవలలోని పాత్రే ఈ వరదరాజు. ఈ శ్రవణ పుస్తకం ఈ వారం విడుదల అవుతుంది. ఈ నవలలో అవసరానికి డబ్బు లేక ఇబ్బందులు పడిన పాత్రల గురించి, అనుకోకుండా డబ్బు రావడంతో ఇబ్బందులు పడిన పాత్రల గురించి, డబ్బు ఉన్నా కూడా వారి సమస్యలకి పరిష్కారం పొందలేని స్థితిలో ఉన్న కొన్ని పాత్రల గురించి నటరాజన్ గారు రాసిన శైలి అప్పటి సమాజాన్నే కాదు, నేటి సమాజాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. 

తమిళనాడులో పుట్టిన నటరాజన్ గారు ఆంధ్ర ప్రదేశ్ కి వలస వచ్చి తెనాలి లో ఒక హోటల్ లో పనిచేస్తూ, తెలుగు నేర్చుకుని ఇంత మంచి నవలలు రాయడం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. కానీ అనారోగ్య కారణాలతో అతి చిన్న వయసులోనే మరణించి, తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప లోటును తెచ్చారు ఆయన. వారు రాసిన ఏది సత్యం నవల తర్వాత విడుదల అవుతున్న మరో నవల ఈ అపస్వరాలు. డబ్బు ఆడించిన వింత నాటకం ఈ అపస్వరాలు నవలలో వినండి. 

అభినందనలతో,

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :